Rahul Gandhi: ఆ పదిహేను మందినీ పట్టుకుంటే చాలు... ఇండియా అమెరికాను మించుతుంది: రాహుల్ గాంధీ

  • 15 మందిని కాపాడుతున్న నరేంద్ర మోదీ
  • వారి వద్దే రూ. 3.50 లక్షల కోట్లు
  • ఆ డబ్బుతో ఇండియాను మార్చవచ్చు
  • శంషాబాద్ లో విద్యార్థులతో రాహుల్

ఇండియాలో కేవలం 15 మంది బడా వ్యాపారవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగానో సహకరిస్తున్నారని, వారు బ్యాంకులకు ఎగ్గొడుతున్న డబ్బు విలువ రూ. 3.5 లక్షల కోట్లని, దాన్ని వసూలు చేస్తే ఇండియా అమెరికా అవుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ఈ ఉదయం శంషాబాద్ లో విద్యాసంస్థల జేఏసీతో సమావేశమైన రాహుల్, మోదీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. నీరవ్ మోదీ, మేహుల్ చౌక్సీ, విజయ్ మాల్యా నుంచి నేడు ఇండియాలోనే ఉన్న అనిల్ అంబానీ వరకూ మోదీ సర్కారు వారికి దాసోహమన్నట్టు ప్రవర్తిస్తోందని రాహుల్ ఆరోపించారు. విదేశాలకు పారిపోయిన ఎవరినీ ఇండియాకు ఇంతవరకూ రప్పించలేకపోయిన మోదీ, బ్యాంకుల్లో కోట్ల కొద్దీ రుణాలు తీసుకుని ఇంకా చెల్లించని వారు దేశం విడిచిపోతే అడ్డుకునే పరిస్థితి లేదని నిప్పులు చెరిగారు.  

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థలను కాంగ్రెస్ కాపాడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోందని, దీన్ని రెండు విడతల్లో అందిస్తామని ఆయన అన్నారు.

దేశంలోని అత్యధిక ధనవంతులుగా ఉండాల్సిన తెలంగాణ ప్రజలను కేసీఆర్, తన అసమర్థ పాలనా విధానాలతో ఆ స్థాయిలో ఉంచలేకపోయారని రాహుల్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి గెలిస్తే, రాష్ట్రం విడిపోయిన వేళ, తెలంగాణ ఎంత ధనిక రాష్ట్రంగా ఉన్నదో, ఆ స్థాయికి మించి డబ్బున్న రాష్ట్రంగా చేసి చూపిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News