old currency: చారిత్రక చిహ్నంగా రద్దయిన రూ.500 నోట్లు... ఆన్‌లైన్‌లో లావాదేవీలు

  • నాణేలు సేకరణ హాబీగా ఉన్న వారు కొంటున్నట్లు సమాచారం
  • అమెరికాకు చెందిన వ్యక్తి అమ్ముతున్నట్లు గుర్తింపు
  • ఆన్‌లైన్‌ విక్రయాలపై కన్నేసిన ముంబయి పోలీసులు

‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటారు... అది నిజమేనేమో అనిపిస్తుంది. రెండేళ్ల కిందట భారత ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్లలో రూ.500 నోటుకు ఇప్పుడు మంచి గిరాకీ ఉందన్న వార్తలు వస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత వీటిని కలిగి ఉండడం చట్టరీత్యా నేరం. దీంతో చాలామంది ఉన్న మేరకు వదిలించుకుని చేతులు దులిపేసుకున్నారు. తాజాగా ఈ నోట్లపై నాణేల సేకరణ హాబీగా ఉన్నవారు, చారిత్రక గుర్తుగా పాత వస్తువులు, నోట్లు, నాణాలు భద్రపర్చుకునేవారు ఆసక్తి చూపుతున్నారని, దీంతో ఈ నోట్లకు మళ్లీ డిమాండ్‌ వచ్చిందని చెబుతున్నారు.

వీరి నుంచి రూ.500 నోట్లకు డిమాండ్‌ ఉండడంతో ఆన్‌లైన్‌లో గుట్టుచప్పుడు కాకుండా లావాదేవీలు నడుస్తున్నాయని పోలీసులకు ఉప్పందింది. దీంతో ముంబయి పోలీసులు నిఘా పెట్టారు. ఆమెరికాకు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి భారతీయులు ఈ రూ.500 నోట్లను ఎక్కువగా కొంటున్నారని తెలిసింది. ఇందుకోసం ఒక్కో నోటుకు ఆరు డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.423 చెల్లిస్తున్నట్లు గుర్తించారు. ఇతని సైట్లో మొత్తం 24 నోట్లు అందుబాటులో ఉండగా అందులో 15 ఇప్పటికే అమ్ముడుపోయినట్లు గుర్తించారు. కొన్ని చోట్ల రూ.500 నోటును 130 డార్లకు కూడా కొంటున్నారట. అంటే దాదాపు రూ.9 వేలు పైమాట. అబ్బో...ఇదేదో విశేషమే అనుకుంటున్నారు కొందరు.

More Telugu News