chattisgargh: ‘ఈవీఎం స్ట్రాంగ్ రూమ్’ లకు కాంగ్రెస్ కార్యకర్తల భద్రత.. అడ్డుగా గోడ కట్టేసిన పోలీసులు!

  • ఛత్తీస్ గఢ్ లో విచిత్ర పరిస్థితి
  • ఫలితాలు తారుమారు కావొచ్చని హస్తం నేతల అనుమానం
  • డిసెంబర్ 11న ఫలితాల విడుదల

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఇటీవల రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో 71.93 శాతం పోలింగ్ నమోదు కావడం అన్ని వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఛత్తీస్ గఢ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్లను తారుమారు చేయొచ్చన్న అనుమానంతో కాంగ్రెస్ పార్టీ కీలక జాగ్రత్తలు చేసుకుంది. ఇందులో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లకు కాంగ్రెస్ కార్యకర్తలు కాపలాగా ఉంటున్నారు.

పోలీసులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఈవీఎం కేంద్రాలకు రక్షణగా ఉంటున్నారు. విడతలవారీగా ఈవీఎం కేంద్రాలకు భద్రత కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూసే అవకాశమున్నందున అవకతవకలకు పాల్పడే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు.

అందుకే ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్ అధికారుల అనుమతితోనే కాపలా కాస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఛత్తీస్ గఢ్ లోని బెమెతరా జిల్లాలో ఈవీఎంలు భద్రపరిచిన గదికి తాళం వేసిన పోలీసులు రక్షణగా ఏకంగా గోడను సైతం కట్టేశారు.

More Telugu News