YSRCP: కోడికత్తి కేసు: విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు పోలీసుల పిలుపు

  • 28న విచారణకు గైర్హాజరు
  • శుక్రవారం హాజరుకావాలంటూ ఆదేశాలు
  • లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
శుక్రవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు గుంటూరు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అంటూ నకిలీ సభ్యత్వ కార్డును సృష్టించి సోషల్ మీడియాలో పెట్టినట్టు రమేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ కేసులో ఈ నెల 6న ఒకసారి జోగి రమేశ్‌ను విచారించిన పోలీసులు, 15న మరోసారి రావాలంటూ ఆదేశాలు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. ఈ నెల 28 వరకు తనకు గడువు కావాలని కోరారు. అయితే, బుధవారం కూడా ఆయన హాజరు కాకపోవడంతో 30న ఎట్టిపరిస్థితుల్లోనూ హాజరు కావాలని, లేదంటే చట్ట పరమైన చర్యలు తప్పవని పోలీసులు జోగి రమేశ్‌ను హెచ్చరించారు.

 కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అంటూ జోగి రమేశ్ పెట్టిన సభ్యత్వ కార్డుతో సోషల్ మీడియాలో వైసీపీ విపరీత ప్రచారం చేసింది. స్పందించిన టీడీపీ అదే నంబరుతో ఉన్న సభ్యత్వ కార్డును సోషల్ మీడియాలో విడుదల చేసింది. అంతేకాదు, నకిలీ కార్డు సృష్టించి టీడీపీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ జోగి రమేశ్‌పై గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అందులో భాగంగానే జోగి రమేశ్‌ను విచారిస్తున్నారు.
YSRCP
YS Jagan
Kodikathi
Visakhapatnam District
Jogi Ramesh
Guntur District

More Telugu News