Chandrababu: నేను అడ్డం పడ్డానా? అని ప్రశ్నిస్తూ... కేసీఆర్ పై విరుచుకుపడ్డ చంద్రబాబు!

  • మోదీతో లాలూచీ పడి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు
  • నేను చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ కొనసాగించింది
  • నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

మంచి ఆదాయం వస్తోంది, రాష్ట్రాన్ని బాగుచేయాలని టీఆర్ఎస్ కు అధికారం ఇస్తే... మోదీతో లాలూచీ పడి, తెలంగాణను భ్రష్టు పట్టించి, తనను తిడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్ ఆధ్వర్యంలో మేనిఫెస్టోను అద్భుతంగా అమలు చేస్తామని చెప్పారు. లేనిపోని మాటలు చెప్పి, ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదని హితవు పలికారు. తెలంగాణలో ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని, ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని అన్నారు. సనత్ నగర్ లో నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ, ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పారని... దానికి తాను అడ్డుపడ్డానా? అని చంద్రబాబు ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇస్తానంటే... తాను అడ్డుపడ్డానా? అని అడిగారు. హుస్సేన్ సాగర్ ను ప్రక్షాళన చేస్తామంటే... తాను అడ్డుపడ్డానా? అని నిలదీశారు. డబుల్ బెడ్ రూమ్ లను కట్టించడానికి తాను అడ్డుపడ్డానా? అని ప్రశ్నించారు. మహిళలకు మంత్రి పదవులు ఇవ్వడానికి తాను అడ్డుపడ్డానా? అని నిలదీశారు.

హైదరాబాదును విశ్వనగరం చేస్తామంటే తాను అడ్డుకున్నానా? అని అడిగారు. కేసీఆర్ కనీసం సచివాలయానికి కూడా వెళ్లలేదని... దానికి కూడా తానే అడ్డు అంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని... దాన్ని తానేమైనా అడ్డుకున్నానా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ను కట్టిస్తామన్న కేసీఆర్ ఒక్క రూమ్ కూడా నిర్మించలేదని మండిపడ్డారు. మహాకూటమి అధికారంలోకి వస్తే బ్రహ్మాండమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తుందని చెప్పారు.

More Telugu News