suravaram sudhakar reddy: బీజేపీపై టీడీపీ పోరాడుతుంటే... కేసీఆర్ మాత్రం మోదీతో అంటకాగుతున్నారు: సురవరం సుధాకర్ రెడ్డి

  • దేశాన్ని మోదీ మతపరంగా చీల్చారు
  • బీజేపీ, టీఆర్ఎస్ లు విమర్శించుకుంటున్నాయి... వాటిని నమ్మవద్దు
  • ఓడినా, గెలిచినా ఫాంహౌస్ లో ఉండే ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా?

నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ముస్లింలు, దళితులు, మేధావులు, రచయితలు, కళాకారులపై దాడులు జరుగుతున్నాయని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. దేశాన్ని మతపరంగా చీల్చడమే కాక, గోరక్షణ పేరుతో ఒక అభద్రతాభావాన్ని సృష్టించారని అన్నారు. ఎన్నో హత్యలకు తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ అరికట్టేందుకు జాతీయ స్థాయిలో ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు.

 బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ పెద్ద పోరాటం చేస్తోందని, టీఆర్ఎస్ మాత్రం బీజేపీతో అంటకాగుతోందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే... బీజేపీకి టీఆర్ఎస్ మద్దతిచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ లు విమర్శించుకుంటున్నాయని... వీటిని నమ్మవద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ముందు తల వంచాల్సిందేనని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారని... కేసీఆర్ సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. ఖమ్మం బహిరంగసభలో మాట్లాడుతూ, ఆయన ఈ వేరకు విమర్శలు గుప్పించారు.

ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలు చేయలేకపోయారని... చివరకు ధర్నా చౌక్ ను కూడా ఎత్తివేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని సురవరం మండిపడ్డారు. ఓడిపోతే ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకుంటానని కేసీఆర్ చెప్పారని... ఆయన గెలిచినా, ఓడినా ఫాంహౌస్ లోనే ఉంటారని... ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? అని ప్రశ్నించారు. బీజేపీ తొత్తుగా ఉన్న కేసీఆర్ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News