Revanth Reddy: కేసీఆర్ లా నేను కల్లు సీసా, కోడి కూర, కమిషన్లు, వాటాలు అడగడం లేదు: రేవంత్ రెడ్డి

  • ప్రజల నుంచి నేను ఓట్లు మాత్రమే అడుగుతున్నా
  • నాపై 39 అక్రమ కేసులను బనాయించారు.. అయినా భయపడను
  • ఒక్కసారి గెలిస్తేనే కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడింది

కొడంగల్ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం కేసీఆర్ మాట్లాడుతూ, కొడంగలా? వరంగల్లా? అని అవమానించారని... ఢిల్లీ వరకు తాను కొడంగల్ స్వరాన్ని వినిపించానని చెప్పారు. కేసీఆర్ పై పోరాటం చేస్తున్నందుకు తనపై 39 అక్రమ కేసులను బనాయించారని తెలిపారు. ప్రజల నుంచి తాను కేవలం ఓట్లు మాత్రమే అడుగుతున్నానని... కేసీఆర్ లా కల్లు సీసా, కోడి మాంసం, కమిషన్లు, వాటాలు అడగడం లేదని చెప్పారు. కొడంగల్ లో ప్రసంగిస్తూ, రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తనపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గే ప్రసక్తే లేదని... కురుక్షేత్ర యుద్ధంలో చివరకు న్యాయమే గెలుస్తుందని రేవంత్ అన్నారు. కేసీఆర్ వైపు ధనం, అధికారం ఉంటే... మనవైపు న్యాయం, ధర్మం ఉన్నాయని చెప్పారు. ఒక్కసారి గెలిస్తేనే కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని దుయ్యబట్టారు.

ఇచ్చిన హామీలన్నింటినీ గంగలో కలపిన కేసీఆర్... కేవలం ఆయన స్వార్థాన్ని మాత్రమే చూసుకున్నారని అన్నారు. కేసీఆర్ మాదిరి కుటుంబంలో ఒక్కరికి కాకుండా... ఇంట్లో ఉన్న ముసలమ్మ, మసలాయనకు రెండు పెన్షన్లు రూ. 4 వేలు ఇస్తామని చెప్పారు. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని మహాకూటమిని గెలిపించాలని... ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ తీసుకొద్దామని అన్నారు. 

More Telugu News