స్నేహితునిపై రేప్ కేస్ పెట్టాలని వేధింపులు... తల్లిదండ్రులపైనే ఫిర్యాదు చేసిన యువతి!

28-11-2018 Wed 11:44
  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • అంగీకరించలేదని వాతలు పెట్టిన తల్లిదండ్రులు
  • పరారీలో ఉన్న తల్లిదండ్రుల కోసం గాలింపు
తన ఫ్రెండ్ పైనే అత్యాచారం కేసు పెట్టాలని కన్న తల్లిదండ్రులు, తాతయ్యలు వేధిస్తున్నారని ఆరోపిస్తూ, 23 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది. ఫిరోజాబాద్ జిల్లా సర్సాగంజ్ పోలీసు స్టేషన్ కు వచ్చిన ఆమె, తాను ఫిర్యాదు చేసేందుకు అంగీకరించకపోవడంతో బిడ్డనని కూడా చూడకుండా తనను హింసించారని ఆరోపించింది. తన చేతులపై, మెడ వద్ద వాతలు పెట్టారని వాపోయింది. ఇప్పటికే తన స్నేహితుడు తనపై అత్యాచారం చేశారని కోర్టులో కేసు వేసిన పెద్దలు, తాను హాజరై అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని హింసిస్తున్నారని తెలిపింది. తల్లిదండ్రులు తనను చంపేస్తారన్న భయంతోనే పోలీసులను ఆశ్రయించానని చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు.