Chandrababu: అందుకే తెలంగాణపై టీడీపీకి హక్కు ఉంది: చంద్రబాబు

  • హైదరాబాద్ నేనే కట్టానని చెప్పలేదు.. సైబరాబాదును నిర్మించింది నేనే
  • జగన్, పవన్ లకు కేసీఆర్ అంటే భయం
  • దేశంలో మూడో ఫ్రంట్ లేదు

తెలంగాణకు తాను అన్యాయం చేయలేదని... ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వారిలో అందరికంటే తానే ముందుంటానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను ఏనాడూ కేసీఆర్ ను తిట్టలేదని... ఆయన తనపై విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం  కావడం లేదని చెప్పారు. ఆయన మాటలు వింటుంటే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత ఎన్టీఆర్ టీడీపీ పెట్టకపోతే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చేవారా? అని ప్రశ్నించారు.

హైదరాబాదును తానే కట్టానని ఎప్పుడూ చెెప్పలేదని... దాన్ని కులీ కుతుబ్ షా కట్టారని... తాను సైబరాబాద్ ను నిర్మించానని చంద్రబాబు చెప్పారు. ప్రపంచమంతా ఎంతో పట్టుదలతో తిరిగి నగరాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. మైక్రోసాఫ్ట్, ఐఎస్బీ, అంతర్జాతీయ విమానాశ్రయం తానే తీసుకొచ్చానని చెప్పారు. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి హైదరాబాదు వరకు అనేక పాఠశాలలు, కళాశాలలు తన వల్లే వచ్చాయని అన్నారు. అందుకే తెలంగాణపై టీడీపీకి హక్కు ఉందని చెప్పారు.

తెలంగాణలో ఎన్నికలు వచ్చాయని... అక్కడ ప్రజాకూటమి ఏర్పడటం న్యాయం కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్ కు జగన్, పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడం ఎంత వరకు న్యాయమని అన్నారు. తెలంగాణలో జనసేన పోటీ చేయడం లేదని, టీఆర్ఎస్ కు వైసీపీ మద్దతు తెలిపిందని వ్యాఖ్యానించారు. వీళ్లిద్దరికీ కేసీఆర్ అంటే భయమని ఎద్దేవా చేశారు. తెలంగాణకు టీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. దేశంలో బీజేపీ ఫ్రంట్, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ మాత్రమే ఉన్నాయని... మూడో ఫ్రంట్ లేదని చెప్పారు. 

More Telugu News