దొంగతనంగా కాదు, చట్టబద్ధంగానే కొన్నా.. లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు బయటపెట్టిన సుజనా చౌదరి!

26-11-2018 Mon 14:27
  • ఈడీ అధికారులు నాపై బురద చల్లుతున్నారు
  • ఒక్క రోజు దాడిచేసి అభాండాలు మోపుతారా?
  • ట్విట్టర్ లో స్పందించిన కేంద్ర మాజీ మంత్రి

తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నివాసాలు, కంపెనీలపై కొన్నిరోజులుగా ఐటీ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుజనా దాదాపు రూ.6,000 కోట్ల రుణాల ఎగవేతకు, మోసానికి పాల్పడ్డారని అధికారులు తమ నోటీసులో చెప్పారు. పలు బినామీ, డొల్ల కంపెనీల ద్వారా సుజనా నిధులను మళ్లించారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి బినామీ కంపెనీల ద్వారా ఖరీదైన పోర్షే, ఆడీ వంటి లగ్జరీ కార్లను ఆయన కొన్నారని ఈడీ ఆరోపించడంపై తాజాగా సుజనా చౌదరి స్పందించారు.

ఈడీ అధికారులు ఒక్కరోజు తనిఖీలు నిర్వహించి తనపై బురద చల్లే ప్రయత్నం చేశారని సుజనా చౌదరి ఆరోపించారు. తానేమీ తప్పు చేయలేదనీ, తనవద్ద ఉన్న కార్లు డొల్ల కంపెనీల నుంచి కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. ఇంట్లో ఉన్న కార్లు అన్నింటిని చట్టబద్దంగానే కొనుగోలు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కార్ల కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల కాపీలను ఆయన బయటపెట్టారు.