Telangana: రైతు బీమా రైతన్నలకు ధీమాగా మారింది.. పోచారం శ్రీనివాసరెడ్డిని నేను లక్ష్మీపుత్రుడని పిలుస్తా!: కేసీఆర్

  • రైతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తున్నాం
  • అవినీతి చీడ లేకుండా చర్యలు తీసుకున్నాం
  • ఈసారి గంపా గోవర్థన్ ను ఆశీర్వదించండి

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకం నిజంగానే రైతన్నల పాలిట ధీమాగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతోనే ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. బాన్సువాడకు చెందిన శ్రీనివాస రెడ్డికి రైతన్నల సమస్యలపై లోతైన అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు నిర్వహించిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.

ప్రమాదాల్లో, సహజ కారణాలతో రైతన్నలు చనిపోతే వారి కుటుంబాలకు బీమా కింద రూ.5 లక్షలను అందజేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ పథకం అమలులో రైతుకు ఎకరం ఉందా? అర ఎకరం ఉందా? అనే విషయంలో ప్రభుత్వం పట్టింపులకు పోలేదన్నారు. అలాగే రైతు బీమా అమలులో అవినీతికి చెక్ పెట్టామనీ, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.ఇలా ఇప్పటివరకూ దాదాపు 3,400 మంది చిన్న, సన్నకారు రైతు కుటుంబాలను ఆదుకున్నామన్నారు.

రైతు బంధు, రైతు బీమా వంటి అద్భుత పథకాలకు తన హయాంలో అంకురార్పణ చేసిన పోచారంను తాను లక్ష్మీ పుత్రుడని పిలుస్తానన్నారు. నిజామాబాద్ లో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామనీ హామీ ఇచ్చారు. జిల్లాలో రెండు పంటలకు నీళ్లందించే బాధ్యత కేసీఆర్ దేనని స్పష్టం చేశారు. నిజామాబాద్ రూరల్ అభ్యర్థి గంపా గోవర్ధన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు. 

More Telugu News