Telangana: తెలంగాణకు రూ.2.30 లక్షల కోట్లు అందించాం.. మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు!: అమిత్ షా

  • మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల్లోకి నెట్టారు
  • దళిత ముఖ్యమంత్రి విషయంలో మాటతప్పారు.
  • బీజేపీ వచ్చాక ప్రతిఊరిలో విమోచన దినం నిర్వహిస్తాం

తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం ఇతోధికంగా సాయం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. గత నాలుగేళ్ల కాలంలో మోదీ సర్కారు రాష్ట్రానికి రూ.2,30,800 కోట్లను అందించిందని వెల్లడించారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంపై రూ.2 లక్షల కోట్ల రుణభారం పెంచిందని విమర్శించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ అధినేత నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తెలంగాణలోని పరకాల నియోజకవర్గంలో ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు.

2014లో దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారనీ, ఈసారైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులు, రైతులు, గిరిజనులపై లాఠీలు విరుగుతున్నాయనీ, కాల్పులు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశామన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం జరుపుతామని ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినట్లు షా తెలిపారు. కానీ ఇప్పుడు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి భయపడి విమోచన దినం జరపడం లేదని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ వచ్చాక గ్రామగ్రామాన విమోచన దినాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.

దేశంలో 50 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని అమిత్ షా తెలిపారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మోదీపై అసూయతో తెలంగాణలో అమలు కాకుండా అడ్డుకుందని విమర్శించారు. ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధి పథకాలను చూసి కేసీఆర్ భయపడుతున్నారని షా అన్నారు.

 దేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకునే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందన్నారు. మరోవైపు మోదీ ప్రభుత్వం రైతుల పంటకు 150 శాతం మద్దతు ధరను అందజేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు, దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతర్థానమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తెలంగాణలో ఈ రెండు పార్టీలు కూటమి కట్టి టీఆర్ఎస్ ను ఓడించేందుకు జట్టుకట్టారన్నారు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ ను బీజేపీ మాత్రమే ఓడించగలదని అమిత్ షా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News