Pawan Kalyan: తూర్పుగోదావరిలో గిరిజనులతో కలిసి చిందేసిన పవన్ కల్యాణ్.. వైరల్ గా మారిన వీడియో!

  • తూర్పుగోదావరిలో పర్యటిస్తున్న జనసేనాని
  • బస్సులో ఏజెన్సీ ప్రాంతానికి ప్రయాణం
  • సంప్రదాయ వాయిద్యాలతో ఘనస్వాగతం పలికిన గిరిజనులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పోరాటయాత్రలో భాగంగా తూర్పుగోదావరిలోని గిరిజనులను పవన్ కలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా తొలుత రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం వరకూ పల్లె వెలుగు బస్సులో ఆయన ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులోని తోటి ప్రయాణికులతో పవన్ ముచ్చటించారు. ఏం చేస్తుంటారు? రోజుకు ఎంత ఆదాయం వస్తుంది? పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆ తర్వాత సుద్ధగొమ్ము గిరిజన ప్రాంతాల్లో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు సంప్రదాయ వాయిద్యాలతో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం పలికారు. తమ ప్రాంతానికి వచ్చిన పవన్ కు గిరిజనులు సంప్రదాయ తలపాగాను బహూకరించారు. దీంతో ఈ తలపాగాను ధరించిన జనసేనాని.. సంప్రదాయ డోలును వాయించారు. అనంతరం గిరిజనులతో కలిసి చిందేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని మీరూ చూసేయండి.

More Telugu News