Andhra Pradesh: చంద్రబాబు తన చుట్టూ ఆర్థిక నేరగాళ్లను పెట్టుకున్నారు.. సుజనా ఓ ఆర్థిక ఉగ్రవాది!: సి.రామచంద్రయ్య

  • ఏపీలో ఆలీబాబా 40 దొంగలు తయారయ్యారు
  • సుజనా డబ్బుతో ఎమ్మెల్యేలు, ఎంపీలను కొన్నారు
  • ప్రతిఫలంగా రాజ్యసభ సీటును కట్టబెట్టారు

ఆలీబాబా 40 దొంగల తరహాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక నేరగాళ్లు, రుణ ఎగవేతదారులను తన చుట్టూ పెట్టుకున్నారని వైసీసీ ఏపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య విమర్శించారు. అలాంటి చంద్రబాబు నిజాయతీ, పారదర్శకతపై నీతులు వల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. సామాన్య ప్రజలు కష్టపడి సంపాదించుకుని బ్యాంకుల్లో దాచిపెట్టుకున్న సొమ్ము సుజనా చౌదరిలాంటి ఆర్థిక ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోతోందని దుయ్యబట్టారు. ఈ సొమ్ముతోనే చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులను కొనుగోలు చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని వైసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏపీ సీఎం చంద్రబాబు మద్దతుతో ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వ్యక్తి సుజనా చౌదరేనని సి.రామచంద్రయ్య ఆరోపించారు. సుజానా అక్రమ సొమ్ముతో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని చెప్పారు. ఆర్థిక నేరస్తులపై దాడులు జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. సుజనా కంపెనీలు కొన్నింటిలో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగనట్లు గుర్తించిన ఐటీ అధికారులు పన్ను కట్టాల్సిందిగా నోటీసులు జారీచేశారని తెలిపారు. అయితే తాము ఉద్దేశపూర్వకంగానే వీటి టర్నోవర్ ను పెంచామని సుజనా కంపెనీ అధికారులు విచారణ సంస్థల ముందు అంగీకరించారని చెప్పారు. ఈ విషయాన్ని ఈడీ స్వయంగా నోటీసులో పేర్కొందన్నారు.

సుజనా చౌదరి మారిషస్ బ్యాంకుకు రూ.100 కోట్లు ఎగ్గొట్టిన్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందిందనీ, కోర్టుకు వెళ్లి దానిపై సుజనా స్టే తెచ్చుకున్నారని తెలిపారు. 2009-14 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికల ఖర్చును సుజనా చౌదరి భరించారని ఆరోపించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయనకు బాబు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. సుజనా అవినీతి చరిత్రను చూసిన మోదీ మరో పేరును సూచించాలని చంద్రబాబును కోరగా.. ‘మాకు బాగా కావాల్సిన వ్యక్తి మోదీజీ.. ఆయన్ను కన్ఫార్మ్ చేయండి’ అంటూ చంద్రబాబు కోరారని పేర్కొన్నారు.

పార్టీకి ఆర్థికంగా మద్దతుగా నిలిచిన సుజనాకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం సమంజసమే అని చంద్రబాబు తన చర్యలను సమర్థించుకున్నారని గుర్తుచేశారు. సుజనాపై ముందుగానే చర్యలు తీసుకుని ఉండిఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలను సమర్థించిన చంద్రబాబు కూడా ఆర్థిక ఉగ్రవాదేనని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు, ఆయన బ్యాంకులకు రూ.6,000 కోట్ల మేర రుణాల ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు.

More Telugu News