Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాబలగాలు!

  • భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం
  • షోపియాన్ జిల్లాలో తెల్లవారుజామున ఎన్ కౌంటర్
  • ఉగ్రవాదుల వివరాలు తెలియరాలేదన్న అధికారులు

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు మరోసారి చావుదెబ్బ తగిలింది. షోపియాన్ జిల్లా కాట్రా బాటాగుంద్ వద్ద ఈ రోజు ఉదయం భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భద్రతాబలగాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.

జిల్లాలోని కాట్రా బాటాగుంద్ వద్ద ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు భద్రతాబలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో వెంటనే ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీస్ సంయుక్త బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని అన్నివైపుల నుంచి చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో బలగాల కదలికలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ ఘటనాస్థలం నుంచి పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. చాలాసేపు కాల్పులు కొనసాగిన అనంతరం ఆగిపోయాయి.

అనంతరం ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఘటనాస్థలంలో భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఎన్ కౌంటర్ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా దక్షిణ కశ్మీర్ మొత్తం మొబైల్ సేవలను అధికారులు నిలిపివేశారు. కాగా, ఈ ఘటనలో చనిపోయిన ఉగ్రవాదుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News