Congress: ఉదయం టీఆర్ఎస్ తీర్థం.. మధ్యాహ్నం కాంగ్రెస్ కండువా.. గంట వ్యవధిలో రెండు పార్టీలు!

  • పార్టీలో చేరిన గంటకే తిరిగి సొంతగూటికి
  • రెండు కండువాలతో ఉన్న ఫొటో వైరల్
  • మహేశ్వరంలో ఘటన

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ నేతలు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో తెలియని పరిస్థితి. ఉదయం ఓ పార్టీలో ఉన్న నాయకుడు మరో గంటలో ఆ పార్టీలో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి. ఇటువంటి ఘటనే ఒకటి సరూర్ నగర్ మండలంలో జరిగింది. జిల్లెల గూడ 1వ వార్డు ఎంపీటీసీ సభ్యుడు పోరెడ్డి భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు. ఆయన భార్య పద్మారెడ్డి గతంలో కాంగ్రెస్ తరపున ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచారు. అయితే, శనివారం ఉదయం ఆయన అకస్మాత్తుగా పార్టీ మారి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.  ఉదయం భాస్కర్ రెడ్డి ఇంటికి వచ్చిన మహేశ్వరం టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి ఆయనను టీఆర్ఎస్‌లోకి  ఆహ్వానించి పార్టీ కండువా కప్పి వెళ్లిపోయారు.  

విషయం తెలిసిన మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి వెంటనే భాస్కర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పార్టీ ఎందుకు మారారని ప్రశ్నించారు. అయితే, కృష్ణారెడ్డి అంతటి వ్యక్తి వచ్చి కండువా కప్పుతుంటే ఏమీ అనలేకపోయానని చెప్పారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వ్యక్తినేనని, టీఆర్ఎస్‌లో చేరేది లేదని స్పష్టం చేసి సబిత చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్‌లో చేరిన గంటకే తిరిగి కాంగ్రెస్ చేరడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తీగల కృష్ణారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో భాస్కర్ రెడ్డి ఉన్న ఫొటోలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి.

More Telugu News