Telangana: ఐదేళ్లూ కూకట్ పల్లి ప్రజలకు తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా!: నందమూరి సుహాసిని

  • ఒక్కసారి ఓటు వేసి ఆశీర్వదించండి
  • ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు
  • 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తా

‘ఒక్కసారి తనకు ఓటు వేస్తే ఐదేళ్లు తోడుగా ఉంటానని కూకట్ పల్లి ప్రజలకు హామీ ఇస్తున్నా’ అని మహాకూటమి(ప్రజాకూటమి) అభ్యర్థి నందమూరి సుహాసిని తెలిపారు. ప్రజలే దేవుళ్లు అన్న తాత నందమూరి తారకరామారావు స్ఫూర్తితో తాను ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. కూకట్ పల్లిలో ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో ఆమె మాట్లాడారు.

ఎన్టీఆర్ మనవరాలైన తనకు కూకట్ పల్లి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని నందమూరి సుహాసిని తెలిపారు. ‘రామారావుగారి మనవరాలైన మిమ్మల్ని గెలిపించేందుకు మేం సంకల్పం కట్టుకున్నాం అమ్మా’ అని చెబుతుంటే తన ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతోందన్నారు. తనను గెలిపిస్తే ఇక్కడ 100 పడకల ఆసుపత్రితో పాటు డ్రైనేజీ సౌకర్యాన్ని మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ త్వరలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని స్పష్టం చేశారు. వాళ్లిద్దరూ ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నారనీ, తీరిక చేసుకుని త్వరలో హాజరవుతారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News