Central minister: కేంద్రమంత్రికి ఎదురు నిలిచిన ఎస్పీ.. ‘దబాంగ్‌’లో సల్మాన్‌లా వ్యవహరించారంటూ నెటిజన్ల ప్రశంసలు

  • మళ్లీ వార్తల్లోకెక్కిన ఎస్పీ యతీశ్ చంద్ర
  • కేంద్ర మంత్రికి మాటకు మాట సమాధానం
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
  • ఎస్పీ తీరుకు ఫిదా అయిన ప్రజానీకం

గతేడాది కేరళలో ఓ లాఠీచార్జి కారణంగా వార్తల్లోకెక్కిన ఐపీఎస్ అధికారి యతీశ్ చంద్ర మళ్లీ తాజాగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఏకంగా కేంద్రమంత్రితో ఢీకొని మాటకు మాట సమాధానం చెప్పి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు. ఆయన ధైర్యానికి ప్రజానీకం ఫిదా అవుతోంది. దబాంగ్ సినిమాలో సల్మాన్‌లా వ్యవహరించారంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అసలు విషయానికి వస్తే.. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ బుధవారం కొందరు నేతలతో కలిసి పెద్ద ఎత్తున ప్రైవేటు వాహనాల్లో శబరిమల దర్శనానికి వెళ్లారు. ఆయన వాహనాలు నీలక్కల్ బేస్ క్యాంప్ వద్దకు రాగానే పోలీసులు నిలిపివేశారు. కేంద్ర మంత్రి అయిన తన వాహనాలనే నిలిపివేయడంతో రాధాకృష్ణన్‌ ఆగ్రహం వెళ్లగక్కడం ప్రారంభించారు. దీంతో యతీశ్ చంద్ర మాటకు మాట సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వాడీవేడి సంభాషణ జరిగింది. ఇప్పుడీ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  
వీరిద్దరి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది...

యతీశ్ చంద్ర: ప్రైవేటు వాహనాలను ఎందుకు అనుమతించడంలేదో నేను మీకు వివరణ ఇస్తాను. ఇటీవల ఇక్కడ వరదలు వచ్చాయి. అందుకే వాహనాలను నిలిపివేస్తున్నాం.

పొన్ రాధాకృష్ణన్: నాకు తెలుసు

యతీశ్ చంద్ర: దయచేసి నేను చెప్పేది వింటారా?

 రాధాకృష్ణన్: ప్రభుత్వ బస్సులు వెళ్తున్నప్పుడు.. ప్రైవేటు వాహనాలను ఎందుకు అనుమతించడం లేదు?

యతీశ్ చంద్ర: ఏమైనా జరగరానిది జరిగితే మీరు బాధ్యత తీసుకుంటారా?

రాధాకృష్ణన్: నేను బాధ్యత తీసుకోను.

యతీశ్ చంద్ర: అదీ ఇక్కడ సమస్య... బాధ్యత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు.

ఎస్పీ నుంచి ఇంతటి వ్యతిరేకతను భరించలేని అనుచరుడొకరు మంత్రితో ఇలాగేనా వ్యవహరించేది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి విషమిస్తుండటాన్ని గమనించిన మంత్రి అనుచరులను శాంతపరిచారు. అనంతరం సాధారణ భక్తుల్లానే ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి శబరిమల ఆలయానికి చేరుకున్నారు.
 
ఈ ఘటనపై యతీశ్‌ చంద్ర మాట్లాడుతూ.. ‘మా విధులు మేము నిర్వర్తిస్తున్నాం. శబరిమలలో ప్రశాంతత నెలకొల్పడం.. భక్తులకు భద్రత కల్పించడమే మా ప్రథమ ప్రాధాన్యం. మేము ఏ పార్టీకి అనుకూలమూ కాదు.. ప్రతికూలమూ కాదు. మాకు ఎలాంటి అజెండా ఉండదు’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News