Telangana: కాంగ్రెస్-టీడీపీ పాలన అంటే కాలిపోయే మోటార్లు.. పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లే!: కేసీఆర్

  • రైతుగా 40 ఏళ్లు కష్టపడ్డాను
  • ఎరువుల కోసం రైతులు అల్లాడారు
  • ఖానాపూర్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

ప్రజాసమస్యలు పరిష్కారం కావాలన్నా, అందరూ సంతోషంగా ఉండాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయనీ, అయితే ప్రజలు గెలవడం, ప్రజల జీవితాలు బాగుపడటం ముఖ్యమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతోందో ప్రతి ఇంట్లో చర్చ జరగాల్సిన అవసరముందని సీఎం పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.

ఎన్నికలు అనగానే మందు బాటిళ్లు, నోట్ల కట్టలు అనే సంస్కృతిని కాంగ్రెస్, టీడీపీలు తీసుకొచ్చాయని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణను భ్రష్టుపట్టిస్తే, టీఆర్ఎస్ సంక్షేమ రాష్ట్రంగా మార్చిందని గుర్తుచేశారు. కరెంట్ ధరలు తగ్గించామనీ, పేదలు, అవ్వాతాతలకు అందించే పెన్షన్లు పెంచామని ముఖ్యమంత్రి చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పాలన అంటే కాలిపోయే కరెంట్ మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లేనని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఓ రైతుగా 40 సంవత్సరాల పాటు తాను ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నానని చెప్పారు.

ఎరువులు, కరెంట్ కోసం అల్లాడిపోయామని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడితే కరెంట్ రాదని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారని కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు దేశంలోనే 24 గంటలు విద్యుత్ ను, రైతులకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని తెలిపారు. గీత కార్మికులకు చెట్లపై విధిస్తున్న పన్నును రద్దుచేసిన ఘనత టీఆర్ఎస్ దేనని పేర్కొన్నారు.

More Telugu News