Narendra Modi: ప్రధాని తెలంగాణ ఎన్నికల ప్రచార పర్యటన ఖరారు... మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్న మోదీ

  • 27న నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సభలు
  • డిసెంబరు 3న హైదరాబాద్‌ సభలో ప్రసంగించనున్న ప్రధాని
  • రాష్ట్రంలో అమిత్‌షా బహిరంగ సభలు, రోడ్డు షోలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి  తేదీలు ఖరారయ్యాయి. ప్రధానితో పాటు కమలనాథుల వ్యూహకర్త, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటనలు కూడా ఖరారయ్యాయి. మోదీ, అమిత్‌షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ నాయకులు రూట్‌ మ్యాప్‌ ఖరారు చేసుకుంటున్నారు.

పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈనెల 27వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఆ రోజు నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జరిగే భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. మళ్లీ డిసెంబరు 3వ తేదీన రెండో విడత ప్రచారానికి వస్తారు. ఆ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో జరిగే సభలో ప్రసంగిస్తారు. ఈ మూడు సభలతోపాటు మరో జిల్లా కేంద్రంలో ప్రధాని సభ నిర్వహిస్తే పార్టీకి కలిసి వస్తుందని కమనాథులు భావిస్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరో వైపు పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా ఈనెల 25, 28, డిసెంబరు 2వ తేదీల్లో జరిగే పలు ఎన్నికల ప్రచార సభలు, రోడ్డు షోల్లో పాల్గొననున్నారు. 24 వ తేదీ రాత్రి  ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో  అమిత్‌షా వస్తారు. 25న మధ్యాహ్నం 12 గంటలకు పరకాలలో, 1.45 గంటలకు నిర్మల్‌లో, 3.20 గంటలకు దుబ్బాక, 4.45 గంటలకు మేడ్చల్‌లో జరిగే సభల్లో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు. అలాగే, 28న మళ్లీ హైదరాబాద్‌ చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్‌లోను, 2 గంటలకు చౌటుప్పల్‌ సభకు హాజరవుతారు. అనంతరం 3.45 గంటలకు హిమాయత్‌నగర్‌ లిబర్టీ, ముషీరాబాద్‌, అంబర్‌పేట మీదుగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వరకు సాగే రోడ్డు షోలో పాల్గొంటారు. సాయంత్రం 5.45 గంటలకు ఎల్బీనగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

డిసెంబరు 2వ తేదీన కూడా రాష్ట్రానికి వచ్చి పలు సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నారాయణపేట, 1.35 గంటలకు ఆమనగల్‌, కల్వకుర్తి, సాయంత్రం 5.15 గంటలకు కామారెడ్డిలో జరిగే సభల్లో పాల్గొంటారు. మధ్యలో మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పల్‌, మల్కాజ్‌గిరిల్లో జరిగే రోడ్‌షోల్లో పాల్గొంటారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లోని పార్టీ అభ్యర్థులు, శ్రేణులకు దిశా నిర్దేశం చేసేలా పర్యటనను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News