Amit Shah: సోహ్రబుద్దీన్ కేసులో అమిత్ షా ప్రధాన కుట్రదారుడు.. బాంబు పేల్చిన దర్యాప్తు అధికారి

  • సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆయనే ప్రధాన కుట్రదారుడు
  • గుజరాత్ మంత్రిగా ఉన్నప్పుడు కాల్పులు జరిపేందుకు ఒప్పందం
  • దర్యాప్తు అధికారి సందీప్ తమ్‌గడే

సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన కుట్రదారుడని ముఖ్య దర్యాప్తు అధికారి సందీప్ తమ్‌గడే ఒకరు బాంబు పేల్చారు. గ్యాంగ్‌స్టర్ సోహ్రబుద్దీన్, తులసీరాం ప్రజాపతి ఎన్‌కౌంటర్లలో అమిత్ షా సహా మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ప్రధాన పాత్ర పోషించారంటూ సందీప్ బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలమిచ్చారు.

 అయితే, తాను కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో ఎటువంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. ట్రయల్ కోర్టు ఇప్పటికే నిర్దోషులుగా ప్రకటించిన అమిత్ షా, గుజరాత్ మాజీ డీజీపీ డీజీ వంజారా, ఇంటెలిజెన్స్ ఎస్పీ రాజ్‌కుమార్ పాండ్యన్, రాజస్థాన్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎంఎన్ దినేశ్‌లు ఈ కేసులో ప్రధాన కుట్రదారులని తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.

అమిత్ షా గుజరాత్ మంత్రిగా ఉన్నప్పుడు ఓ బిల్డర్ కార్యాలయం వద్ద కాల్పులు జరిపేందుకు సోహ్రబుద్దీన్, ప్రజాపతిలను ఉపయోగించుకున్నట్టు తన వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని సందీప్ తెలిపారు.  అయితే, ఈ కేసులో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లలో అమిత్ షా, ఇతరులపై ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అంగీకరించారు. అప్పట్లో సీబీఐ ఎస్పీగా ఉన్న సందీప్ సోహ్రబుద్దీన్, తులసీరాం కేసుల్లో చార్జిషీట్లను తయారు చేశారు. ఈ రెండు కేసులను సీబీఐ ప్రత్యేక జడ్జి ఎస్‌జే శర్మ విచారిస్తున్నారు.  కాగా, అమిత్ షా ప్రధాన కుట్రదారంటూ సందీప్ ఇచ్చిన వాంగ్మూలంతో జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. ప్రతిపక్షాలు ఆయనపై కత్తులు నూరుతున్నాయి.

More Telugu News