Andhra Pradesh: ఇష్టారాజ్యంగా పన్నులు వేస్తాం, పెత్తనం చేస్తాం అంటే చూస్తూ ఊరుకోం!: కేంద్రానికి చంద్రబాబు హెచ్చరిక

  • జగన్ పిరికిపందలా ఏపీని తాకట్టుపెట్టారు
  • వేధింపులు ఎదురైనా వెనక్కి తగ్గబోం
  • దేశాన్ని కాపాడేందుకు బీజేపీపై యుద్ధం

కేంద్రం విచారణ సంస్థలతో ఎన్నిరకాలుగా వేధించినా వెనక్కి తగ్గబోమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను ఎంతగా అణచివేస్తే అంతగా ఎదురుతిరుగుతామని స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా పన్నులు వసూలు చేస్తూ పెత్తనం చేస్తామంటే ఊరుకోబోమని తేల్చిచెప్పారు. మోదీని విమర్శిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని  జగన్ భయపడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే బీజేపీ నేతలకు కడుపు మండుతోందని చంద్రబాబు విమర్శించారు. తన పిరికితనంతో రాష్ట్ర ప్రయోజనాలను జగన్ కేంద్రానికి తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రూ.75,000 కోట్లు ఏపీకి ఇవ్వాల్సి ఉందని తేల్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు అదంతా మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక రాష్ట్రంలో బీజేపీ నేతల లాలూచీ రాజకీయాలు సాగవని చంద్రబాబు స్పష్టం చేశారు.

దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే బీజేపీపై యుద్ధం ప్రకటించారని చంద్రబాబు తెలిపారు. ఈ పోరాటంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గబోమన్నారు. అందరినీ ఏకం చేసి దేశాన్ని కాపాడుకుంటామని పేర్కొన్నారు. బీజేపీ నేతల చేష్టలను ప్రజలు చూస్తున్నారనీ, సరైన సమయంలో వారికి తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు స్పష్టం చేశారు.

More Telugu News