Kushboo: కేసీఆర్ బిగ్ జీరో.. ఆయనకు పదవి ఎందుకు?: ఖుష్బూ ఫైర్

  • అప్పులిచ్చే స్థితి నుంచి అప్పులు చెల్లించాల్సిన స్థితికి
  • కుటుంబం కోసమే సీఎం కావాలనుకుంటున్న కేసీఆర్
  • క్యాబినెట్ లో మహిళలకు స్థానమెక్కడ?
  • గాంధీభవన్ లో మీడియాతో ఖుష్బూ
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదని, అప్పులిచ్చే స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చెల్లించాల్సిన స్థితిలోకి నెట్టారని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నటి ఖుష్బూ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం హైదరాబాదులోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. 'కేసీఆర్ బిగ్ జీరో' అని మండిపడిన ఆమె, గత రెండున్నరేళ్లుగా సచివాలయానికి వెళ్లని ఆయనకు పదవి ఎందుకని ప్రశ్నించారు.

తన కుటుంబ ప్రయోజనాల కోసమే ఆయన తిరిగి సీఎం కావాలని కలలు కంటున్నారని ఆరోపించారు. మహిళా సాధికారతపై మాట్లాడే కేసీఆర్, తన క్యాబినెట్ లో ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేసిన ఖుష్బూ, ఈ ఎన్నికల్లో కేవలం నలుగురు మహిళా అభ్యర్థులను మాత్రమే టీఆర్ఎస్ నిలిపిందంటే, మహిళలపై ఉన్న అభిమానం ఏంటో తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి తమ ఫథకాలుగా టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. కల్యాణలక్ష్మి వంటి పథకాలను కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు మాత్రమే పరిమితం చేశారని మండిపడ్డారు.
Kushboo
Congress
Telangana
Gandhi Bhavan
KCR

More Telugu News