Kondaveeti Jyothirmayee: టీటీడీ పేరు మార్చండి, తిరుపతిలో మద్యం అమ్మకాలు వద్దు: జగన్ ను కలిసి విన్నవించిన జ్యోతిర్మయి!

  • ధార్మిక సేవా పరిషత్ గా మార్చండి
  • 25 కిలోమీటర్ల పరిధిలో మద్యం వద్దు
  • పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసిన జ్యోతిర్మయి

తిరుమల తిరుపతి దేవస్థానం పేరును ధార్మిక సేవా పరిషత్ గా మార్చాలని ఆధ్యాత్మిక గీతాల గాయని, ప్రవచనకర్త కొండవీటి జ్యోతిర్మయి కోరారు. ఈ ఉదయం పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ను కలిసిన ఆమె, టీటీడీలో రాజకీయాల జోక్యం పెరిగిపోయిందని, దీన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

తిరుపతికి 25 కిలోమీటర్ల పరిధిలో మద్యం విక్రయాలు జరుగకుండా చూడాలని, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల స్థానంలో సంఘ సేవలో పేరున్న వారిని టీటీడీ బోర్డులో నియమించాలని ఆమె కోరారు. ఈ అంశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని, అధికారంలోకి వస్తే తన సూచనలను అమలు చేసేందుకు కృషి చేయాలని జ్యోతిర్మయి కోరగా, జగన్ అందుకు సానుకూలంగా స్పందించారు. టీటీడీ బోర్డు ప్రక్షాళన గురించిన ఆలోచన తన మనసులో ఉన్నదని ఆయన అన్నారు.

ఆపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, భారతీయులు పరమ పవిత్రంగా భావించి వచ్చే తిరుమలను మరింత పవిత్రంగా చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే హిందూ ధర్మం పదికాలాల పాటు నిలుస్తుందని అన్నారు. టీటీడీలో సంస్కరణలు జరిగిన రోజే, అన్ని ఆలయాలూ అదే దారిలో నడుస్తాయని అన్నారు. ఆ ప్రక్రియను వైఎస్ జగన్ చేయాలన్నది తన అభిమతమని చెప్పారు.

More Telugu News