KCR: వచ్చే ఆరు రోజులూ విశ్రాంతి లేకుండా తిరగనున్న కేసీఆర్... షెడ్యూల్ వివరాలు!

  • నేటితో ముగియనున్న నామినేషన్ల ఘట్టం
  • నేటి నుంచి తీవ్రతరం కానున్న నేతల ప్రచారం
  • మధ్యాహ్నం నుంచి కేసీఆర్ సుడిగాలి పర్యటన ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ఘట్టానికి నేటి మధ్యాహ్నం 3 గంటలకు తెరపడనుండగా, అసలు యుద్ధం నేటి నుంచే ప్రారంభం కానుంది. నేటి నుంచి నాయకులంతా ప్రచారంపై దృష్టిని సారించనున్నారు. తెరాస అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, వచ్చే ఆరు రోజుల్లో 22 నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

విశ్రాంతి లేకుండా సాగే ఆయన పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు ఖమ్మంలో, ఆపై 3.30 గంటలకు పాలకుర్తిలో జరిగే టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఆపై రేపు 20వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు సిద్ధిపేట, 2.30 గంటలకు హుజూరాబాద్, 3.30 గంటలకు సిరిసిల్ల, సాయంత్రం 4.30 గంటలకు ఎల్లారెడ్డిలో ఆయన పర్యటన ఉంటుంది.

21వ తేదీన జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, మెదక్, భువనగిరి నియోజకవర్గాల్లో, 22న ఖానాపూర్, ఇచ్చడో, నిర్మల్, ముథోల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో జరిగే రోడ్ షోలు, సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 23న నర్సంపేట, మహబూబాబాద్, మరిపెడ, సూర్యాపేట, తిరుమలగిరి, జనగామ ప్రాంతాల్లో ప్రచారం తరువాత, ఒక రోజు విరామం అనంతరం ఆయన ప్రచారం తిరిగి మొదలవుతుంది.

25న తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. ఆ తరువాతి వారం ప్రచార షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News