Train 18: భారతీయ రైల్వేలో నూతన శకం.. విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న ఇంజిన్ లేని రైలు!

  • త్వరలోనే అందుబాటులోకి ‘ట్రైన్ 18’
  • వేగానికి చిరునామా
  • దేశీయంగా అభివృద్ధి

భారతీయ రైల్వేలో నూతన అధ్యాయం మొదలు కాబోతోంది. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) అభివృద్ధి చేసిన తొలి స్వయం చాలిత (ఇంజిన్ లేని) రైలు ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ‘ట్రైన్ 18’గా పిలిచే ఈ రైలు గరిష్ట వేగం గంటకు 220 కిలోమీటర్లు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సక్సెసర్‌గా దీనిని అభివృద్ధి చేశారు.

ఆదివారం ఉదయం మొరాదాబాద్-రాంపూర్ సెక్షన్‌లో ‘ట్రైన్ 18’కు ఉత్తర రైల్వే ట్రయల్ రన్ నిర్వహించింది. వివిధ వేగాల్లో నిర్వహించిన పరీక్షలు విజయవంతమైనట్టు అధికారులు తెలిపారు. తొలుత గంటకు 30 కిలోమీటర్లు, తర్వాత 50, అనంతరం గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ నిర్వహించారు. అలాగే, బ్రేకుల పనితీరును కూడా పరీక్షించినట్టు అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్ (ఏఓఎం) డీపీ సింగ్ తెలిపారు.

‘ట్రైన్ 18’లో డ్రైవింగ్ కోచ్‌తో కలిపి మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ట్రైలర్ కోచ్‌లలో 44, 78 సీట్లు ఉంటాయి. బేబీ కేర్ కోసం ప్రత్యేక సదుపాయం, డిసేబుల్డ్ ఫ్రెండ్లీ టాయిలెట్లు, ప్రత్యేక ప్యాంట్రీ కార్లు ఉన్నాయి. అలాగే, ప్లాట్‌ఫాంలో రైలుకు ముందు వెనక సీసీటీవీ కెమెరాలు కూడా అమర్చారు. డోర్లు మూసివేసే ముందు ప్రయాణికులను డ్రైవర్ గమనించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే రైల్వేలో నూతన అధ్యాయానికి నాంది పలికినట్టు అవుతుందని రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. భారత్ కూడా ఇటువంటి రైళ్లను అభివృద్ధి చేయగలదని ప్రపంచానికి చాటిచెప్పినట్టు అవుతుందన్నారు.

More Telugu News