Nandamuri Suhasini: కూకట్‌పల్లి గురించి నాకు బాగా తెలుసు.. అక్కడ మాకు బంధువులున్నారు: నందమూరి సుహాసిని

  • అనూహ్యంగా రాజకీయ తెరపైకి సుహాసిని
  • గెలుపుపై పూర్తి విశ్వాసం
  • మహిళా సమస్యల పరిష్కారానికి కృషి

అనూహ్యంగా రాజకీయ తెరపైకి వచ్చి కూకట్‌పల్లి టికెట్ దక్కించుకున్న టీటీడీపీ నేత నందమూరి సుహాసిని ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారారు. చిన్నప్పటి నుంచి రాజకీయాలపై మక్కువ ఉన్నా అవకాశం ఎప్పుడూ రాలేదు. ఇప్పుడూ అనుకోకుండా అవకాశం రావడంతో ప్రజాసేవకు నడుంబిగించారు.  నామినేషన్ అనంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పుకొచ్చారు.

తనకు రాజకీయాలపై ఉన్న ఇష్టాన్ని, ఆసక్తిని తండ్రి హరికృష్ణ గమనిస్తూనే వచ్చారని సుహాసిని తెలిపారు. ఓసారి తండ్రితో మాట్లాడుతూ తనకు ప్రజాసేవ చేయాలని ఉందని చెప్పానని గుర్తు చేసుకున్నారు. అయితే, అప్పుడు రాని అవకాశం ఇప్పుడు రావడం సంతోషంగా ఉందన్నారు. తాను పోటీ చేస్తున్న కూకట్‌పల్లిపై  అవగాహన ఉందని, తమ చుట్టాలు అక్కడే ఉండడంతో చాలాసార్లు ఆ ప్రాంతంలో తిరిగానని, చాలామందితో పరిచయాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన గెలుపుపై పూర్తి విశ్వాసం ఉందన్న సుహాసిని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. గతంలో ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని కట్టిస్తానని టీఆర్ఎస్ హామీ ఇచ్చి నెరవేర్చలేదని, దానిని తాను పూర్తి చేస్తానని అన్నారు.

ఈ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. టీడీపీ నేతల నుంచే కాక స్థానికుల నుంచి కూడా తనకు పూర్తి మద్దతు, సహకారం ఉన్నాయని, తప్పకుండా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే పాదయాత్రగా వెళ్లి అందరినీ కలుస్తానని సుహాసిని తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా తనకు పూర్తి సహకారం ఉందని, చంద్రబాబు నాయుడు, లోకేశ్, కల్యాణ్ రాం, జూనియర్ ఎన్టీఆర్ అందరూ ప్రచారానికి వస్తారని, అయితే, ఎవరికి వీలైన సమయంలో వారు వచ్చి ప్రచారం చేస్తారని సుహాసిని తెలిపారు.

More Telugu News