Chinthamaneni Prabhakar: నేనింతే.. నేను ఇలాగే ఉంటా.. అవసరమైతే చంద్రబాబుకే జవాబు చెప్పుకుంటా!: చింతమనేని ప్రభాకర్

  • అభివృద్ధి  పనులను కొందరు ఓర్వలేకున్నారు
  • విద్యార్థినికి లోన్ విషయంలో గొడవ అయింది
  • టీడీపీ నేతలు వైసీపీ ట్రాప్ లో పడ్డారు
దెందులూరులో తాను చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని కొందరు అనవసర వివాదాలకు తెరలేపుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. స్థానికంగా స్కూలులో చదువుకుంటున్న ఓ విద్యార్థినికి లోన్ ఇప్పించే విషయంలో పెదవేగి మాజీ సర్పంచ్‌ మేడికొండ సాంబశివ కృష్ణారావుతో తనకు అభిప్రాయభేదాలు వచ్చాయని చెప్పారు. అంతేతప్ప తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. తాను చేపడుతున్న మంచి పనులను ఎవ్వరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు వేంపాడులో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ నేతలతో కలిసి చింతమనేని పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ.. తాను ప్రజా నాయకుడిననీ, ఇలాగే ఉంటానని చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. తమపై వచ్చిన ఫిర్యాదులపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుకే సమాధానమిస్తానని వ్యాఖ్యానించారు. స్థానికంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి బయటివాడు వచ్చే అవకాశమే లేదన్నారు. ‘నేనింతే.. నేను ఇలాగే ఉంటా. నేనేమీ వందలకోట్ల ఆస్తులు సంపాదించలేదు. పేదలకు కష్టం వస్తే.. ఆ కష్టం కలిగించినవాడు ఎంతగొప్ప వాడైనా వదలను. నాకు వ్యతిరేకంగా కొందరు టీడీపీ నేతలు ప్రతిపక్షాల ట్రాప్ లో పడ్డారు’ అని పేర్కొన్నారు.
Chinthamaneni Prabhakar
Andhra Pradesh
Telugudesam
Chandrababu

More Telugu News