transgender: అందుకే, ట్రాన్స్ జెండర్ కు టికెట్ కేటాయించాం: టీ-సీపీఎం కార్యదర్శి తమ్మినేని

  • సామాజిక మార్పులో భాగంగానే ట్రాన్స్ జెండర్ కి టికెట్
  • చంద్రముఖి ఉన్నత చదువు చదివింది
  • ఓ ట్రాన్స్ జెండర్ కు టికెట్ కేటాయించిన ఘనత మాదే  

సామాజిక మార్పులో భాగంగానే ఈసారి ట్రాన్స్ జెండర్ కి టికెట్ కేటాయించామని తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. గోషామహల్ టికెట్ ను ట్రాన్స్ జెండర్ చంద్రముఖికి కేటాయించిన విషయమై ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్ జెండర్ కు టికెట్ కేటాయించిన ఘనత తమకే దక్కుతుందని, చంద్రముఖి ఉన్నత చదువు చదివిందని, అన్ని వర్గాల ప్రజలతో రాజకీయ చైతన్యం పెంపొందించడం కోసమే బీఎల్ ఎఫ్ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్) ఏర్పాటు చేశామని మరోసారి స్పష్టం చేశారు. ఎంఐఎం, బీజేపీలతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నటీఆర్ఎస్ పార్టీని మైనార్టీలు నమ్మబోరని తమ్మినేని అన్నారు. కాగా, బీఎల్ ఎఫ్ తరపున పోటీ చేసే 14 స్థానాల అభ్యర్థుల ఐదో జాబితాను నిన్న విడుదల చేశారు. ఈ జాబితాలో చంద్రముఖి పేరు కూడా ఉంది.

ఏ రాజకీయ పార్టీ మాకు న్యాయం చేయలేదు
 
తనకు అవకాశం కల్పించింనందుకు బీఎల్ ఎఫ్ కు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చంద్రముఖి పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ తమకు న్యాయం చేయలేదని అన్నారు.

బీల్ఎఫ్ ఆరో జాబితా విడుదల

తాజాగా, బీల్ఎఫ్ ఆరో జాబితాను ఈరోజు విడుదల చేసింది. ముథోల్ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్, సనత్ నగర్ నుంచి కల్లు వెంకటేశ్వరరెడ్డి, కుత్బుల్లాపూర్ నుంచి బుడిగె లింగస్వామి, మల్కాజ్ గిరి నుంచి ఐలయ్య, చాంద్రాయణగుట్ట నుంచి మహ్మద్ హాజీ, స్టేషన్ ఘన్ పూర్ నుంచి బొట్ల శేఖర్ బరిలోకి దిగనున్నారు. ఇప్పటివరకు 106 అభ్యర్థులను బీఎల్ఎఫ్ ప్రకటించింది.

ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ చైర్మన్ నల్ల సూర్య ప్రకాష్ మాట్లాడుతూ, పాలకపక్షాలకు బీఎల్ఎఫ్ మాత్రమే ప్రత్యామ్నాయమని, బీసీలకు టీఆర్ఎస్ 25, కాంగ్రెస్ 22 సీట్లు మాత్రమే ఇచ్చాయని, తాము మాత్రం 52 సీట్లిచ్చామని స్పష్టం చేశారు.

More Telugu News