JCC ajitjjogi: ప్రతిపక్షంలో కూర్చునేందుకైనా సిద్ధం... బీజేపీతో మాత్రం కలిసేది లేదు: అజిత్ జోగి

  • జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ) పార్టీ అధ్యక్షుడు అజిత్‌జోగి
  • అన్ని మతగ్రంథాలపై ప్రమాణం చేసి ఈ మాట చెబుతున్నా
  • భాజపాకు తెలిసినవి విభజన రాజకీయాలు మాత్రమే

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల సమరంలో నిండా మునిగి ఉన్న జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ) పార్టీ అధ్యక్షుడు అజిత్‌జోగి భారతీయ జనతా పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో కూర్చునేందుకైనా సిద్ధం కాని, బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అన్ని మతగ్రంథాలపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నానని తెలిపారు.

రాష్ట్రంలో రెండో దశ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఆదివారంతో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. చివరి రోజు నిర్వహించిన ప్రచార సభలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీవన్నీ విభజన రాజకీయాలని, మతం పేరుతో మనుషుల్ని రెచ్చగొట్టడమే ఆ పార్టీ నేతలకు తెలుసునని ధ్వజమెత్తారు. అవసరమైతే ప్రాణాలు తీసుకుంటాగాని, అటువంటి మతతత్వ పార్టీతో చేతులు కలపనని స్పష్టం చేశారు.

కొద్దిరోజుల క్రితం ’రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ నిర్దేశించ లేరు, ప్రజల మనసులో ఏముందో కూడా తెలుసుకోవడం కష్టం’ అని వ్యాఖ్యానించిన అజిత్‌జోగి చివరి రోజు ఇలా మాట్లాడడం గమనార్హం.

More Telugu News