Chandrababu: అత్యంత విలువైన ‘హాయ్‌ల్యాండ్’.. అగ్రిగోల్డ్ భూమి కాదని డ్రామాలాడుతున్నారు: జగన్

  • అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ కాజేస్తున్నారు
  • బాధితులకు నిరాశే మిగిలింది
  • బినామీలకు అమ్ముకునేందుకు యత్నిస్తున్నారు

అగ్రిగోల్డ్‌లో అత్యంత విలువైన భూమి హాయ్ ల్యాండ్. ఇది అగ్రిగోల్డ్‌కు చెందినది కాదంటూ చంద్రబాబునాయుడు గారు డ్రామాలాడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. నేడు పార్వతీపురంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన అగ్రిగోల్డ్ బాధితుల వెతలపై ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

‘‘ఈ ప్రాంతంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువ. నా దగ్గరకొచ్చి వారంతా బాధపడుతున్నప్పుడు చంద్రబాబు గారి పాలన చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా. కారణం అగ్రిగోల్డ్ బాధితులకు తోడుగా నిలవాల్సిన ఈ ప్రభుత్వం వారిని మోసం చేస్తున్న పరిస్థితిని చూసి బాధనిపిస్తోంది.

అగ్రిగోల్డ్‌కు సంబంధించిన విలువైన ఆస్తులన్నింటిని కూడా పక్కనబెడుతున్నారు. వీటన్నింటినీ చంద్రబాబు, ఆయన బినామీలు, ఆయన కుమారుడు లోకేశ్ గారు పూర్తిగా కాజేస్తున్నారు. ఓవైపు అగ్రిగోల్డ్ ఆస్తులను తగ్గిస్తూ.. బాధితుల జీవితాలతో ఆడుకుంటూ చివరకు అగ్రిగోల్డ్‌లో అత్యంత విలువైన భూమి హాయ్ ల్యాండ్. ఇది అగ్రిగోల్డ్‌కు చెందినది కాదంటూ చంద్రబాబునాయుడు గారు డ్రామాలాడుతున్నారు. నాలుగేళ్ల పాటు కోర్టుల పర్యవేక్షణలో అమ్ముడుపోతుందని ఆశగా ఎదురు చూస్తున్న బాధితులకు నేడు నిరాశే మిగిలింది.

చంద్రబాబు నాయుడుగారు, ఆయన పోలీసులు, సీఐడీలతో తన బినామీలకు అమ్ముకునే కార్యక్రమం చేపడుతున్నారు. నేడు ఇదే కోర్టులో అగ్రిగోల్డ్ కేసు విన్న జడ్జి ‘హాయ్‌ల్యాండ్ ఎండీ ఆలూరి వెంకటేశ్వరరావుగారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు’ అని సీఐడీ అధికారులను అడిగారు. అప్పుడు గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ ‘ఆయన నిందితుడు కాదు కాబట్టే సీఐడీ అరెస్ట్ చేయలేదు’ అని తెలిపారు. ఆ ఆస్తులను తప్పించేందుకు సీఐడీ అధికారులు, చంద్రబాబు ఎంత పెద్ద పన్నాగం పన్నారో చెప్పడానికి ఇంతకన్నా వేరొక నిదర్శనం అవసరమా? అని ప్రశ్నిస్తున్నా’’ అని జగన్ ధ్వజమెత్తారు.

More Telugu News