Anantapur District: కొడుకు బలవన్మరణం తట్టుకోలేక కూతురు సహా దంపతుల ఆత్మహత్యా యత్నం

  • పురుగుల మందుతాగి చనిపోయేందుకు ప్రయత్నం
  • తండ్రీకూతుర్ల పరిస్థితి విషమం
  • అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం జలాలపురంలో ఘటన
తన తల్లిపై జనం నిందలు వేస్తుండడం తట్టుకోలేని కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని తట్టుకోలేని దంపతులు తాము కూడా పురుగులు మందు తాగి కూతురితో సహా చనిపోయేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో తండ్రీకూతుర్ల పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం జలాలపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

గ్రామానికి చెందిన శిరీష, శ్రీనివాసులు దంపతులు. వీరికి ఆరో తరగతి చదివే కొడుకు ఉమేష్‌ చంద్ర, ఐదో తరగతి చదివే కూతురు కీర్తన ఉన్నారు. శిరీష ఆశా వర్కర్‌గా పనిచేస్తుండగా, శ్రీనివాసులు ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నాడు. ఆశా వర్కరైన శిరీష విధుల్లో భాగంగా పలువురి ఇంటికి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆమె పట్ల స్థానికులు కొందరు అసభ్యంగా మాట్లాడడం ఉమేష్‌చంద్ర విన్నాడు. తరచూ ఇటువంటి మాటలు వినడంతో మనస్తాపానికి గురై సోమవారం రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

అప్పటికి మధ్యప్రదేశ్‌లో ఉన్న శ్రీనివాసులు కొడుకు మృతి సమాచారంతో స్వగ్రామం వచ్చాడు. అంత్యక్రియలు పూర్తి చేశాడు. గురువారం రాత్రి శ్రీనివాసులు, శిరీష మధ్య గొడవ జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున కుమార్తెతో పురుగుల మందు తాగించి, దంపతులు కూడా తాగేశారు. ఈ చర్యకు ముందే శ్రీనివాసులు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి తాను పనిచేస్తున్న కార్యాలయం అధికారికి వాట్సప్‌ మెసేజ్‌ పంపాడు. కంగారుపడిన ఆయన బత్తనపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు.

ఎస్‌ఐ గ్రామస్థులను అప్రమత్తం చేయడంతో కొందరు శ్రీనివాసులు ఇంటికి చేరుకుని బాధితులు ముగ్గురినీ ఆర్‌డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శిరీషను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు, కీర్తనల పరిస్థితి విషమంగా ఉంది.
Anantapur District
bathalapalli mandal
Crime News

More Telugu News