Cyclone Gaja: తమిళనాడులో ‘గజ’ బీభత్సం.. 28 మంది మృతి.. 81 వేల మంది తరలింపు

  • తమిళనాడును అతలాకుతలం చేసిన ‘గజ’
  • నేల కూలిన 30 వేల విద్యుత్ స్తంభాలు
  • మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం

‘గజ’ తుపానుతో తమిళనాడు చిగురుటాకులా వణికింది. ఎప్పటికప్పుడు వేగాన్ని, స్థితిని మార్చుకుంటూ వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేసింది. తమిళనాడులోని నాగపట్టణం-పుదుచ్చేరిలోని వేదారణ్యం మధ్య తీరం దాటే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి.  గాలుల తాకిడికి 30 వేల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వేలాది ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. 16వ శతాబ్దానికి చెందిన వేలాంగణ్ని క్రైస్తవ  పుణ్యక్షేత్రంలోని చర్చి పైభాగం ధ్వంసమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. రోడ్లు తెగి రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది.

గజ తుపాను దెబ్బకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాల నుంచి 81 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చాలా వరకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ బలగాలు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. కాగా, తమిళనాడును వణికించిన గజ తుపాను వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

More Telugu News