Telangana: అఫిడవిట్లు చూస్తే అవాక్కే... కిలోల కొద్దీ బంగారాన్ని కలిగున్న అభ్యర్థుల భార్యలు!

  • పలువురి భార్యల వద్ద భారీ ఎత్తున బంగారం
  • కేసీఆర్ భార్య శోభ వద్ద 2.2 కిలోలు
  • దామోదర రాజనర్శింహ భార్య వద్ద 2 కిలోల బంగారం

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల అఫిడవిట్లలో వెల్లడిస్తున్న వివరాలు పరిశీలిస్తుంటే, వారి భార్యల పేరిట ఉన్న కిలోల కొద్దీ బంగారం వివరాలు బయటకు వస్తున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, తన భార్య శోభ పేరిట 2.20 కిలోల బంగారం, విలువైన వజ్రాలు ఉన్నాయని చెప్పగా, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, తన భార్య పద్మినీ రెడ్డి పేరిట రెండు కిలోల బంగారం ఉందని అఫిడవిట్ లో చూపించారు. ఇక మంత్రి హరీశ్ రావు విషయానికి వస్తే, ఆయన భార్య శ్రీనిత పేరిట 1.20 కిలోల బంగారం, 9.50 కిలోల వెండి ఉంది. హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి భార్య రాజ్యలక్ష్మి వద్ద అరకిలో, సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి రాజేశ్వరరావు భార్య వద్ద 555 గ్రాముల బంగారం ఉందట.

ఇక పటాన్ చెరు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గోక శశికళ, తన పేరిట కిలో బంగారం ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. మాజీ మంత్రి, జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని గీతారెడ్డి వద్ద 60 తులాలు, ఆమె భర్త వద్ద 20 తులాల బంగారం ఉండగా, నర్సాపూర్ నేత సునీతా లక్ష్మారెడ్డి వద్ద 25 తులాల బంగారం ఉంది. ఆంధోల్ టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్, తన భార్య పేరిట, అందరికన్నా తక్కువగా 8.5 తులాల బంగారం ఉన్నట్టు చూపించారు.

వీరితో పాటు జహీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి మానిక్ రావు భార్య వద్ద 90 తులాలు, మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి శశిధర్ రెడ్డి వద్ద 40 తులాలు, హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ భార్య వద్ద 35 తులాల బంగారం ఉందట. ఆందోల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాబూమోహన్, తన భార్య వద్ద 20 తులాల గోల్డ్ ఉన్నట్టు అఫిడవిట్ లో చూపించారు.

More Telugu News