Suhasini: తోబుట్టువును గెలిపించే బాధ్యత ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లపై పెట్టిన చంద్రబాబు!

  • కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లతో మాట్లాడిన చంద్రబాబు
  • నందమూరి కుటుంబం నుంచి ఎవరైనా ఉంటే మహాకూటమికి ఊపు
  • కూకట్ పల్లిలో ఉన్న అభిమానుల దృష్ట్యా గెలుపు సులభమేనన్న చంద్రబాబు

దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్ పల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని నిర్ణయించుకున్న చంద్రబాబు, ఆమెను గెలిపించే బాధ్యతను కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లపై ఉంచారు. నిన్న సుహాసినిని పిలిపించి మాట్లాడిన ఆయన, ఆపై హరికృష్ణ తనయులతోనూ చర్చించారు. అక్కను గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు.

నందమూరి కుటుంబం నుంచి తెలంగాణ ఎన్నికల్లో ఎవరైనా ఉంటే బాగుంటుందని ముందు నుంచే ఆలోచనలో ఉన్న చంద్రబాబు, తొలుత ఆ చాన్స్ ను కల్యాణ్ రామ్ కు ఇవ్వాలని భావించిన సంగతి తెలిసిందే. అయితే, తాను మరికొంత కాలం సినీ రంగంలోనే సాగుతానని, ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేయడంతో సుహాసిని పేరు తెరపైకి వచ్చింది.

ఆమెను నిలిపితే, తెలంగాణలో మహాకూటమికి ఊపు వస్తుందని టీడీపీ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. నందమూరి కుటుంబానికి కూకట్ పల్లి ప్రాంతంలో ఉన్న అభిమానుల సంఖ్య దృష్ట్యా, సుహాసిని గెలుపు సునాయాసం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. కాగా, న్యాయవాద విద్యను పూర్తి చేసిన సుహాసిని మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కోడలన్న సంగతి తెలిసిందే.

More Telugu News