december 7: డిసెంబర్ 7 నాటికి కచ్చితంగా రెండు వికెట్లు పడతాయి: రేవంత్ రెడ్డి

  • ఎంపీలు ఇద్దరన్నాను కానీ వారి పేర్లు చెప్పేలేదుగా?
  • భుజాలు తడుముకోవడమెందుకు?
  • ఆ ఇద్దరు ఎంపీలను కేటీఆర్ వివరణెందుకు అడిగారో?

అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోపే టీఆర్ఎస్ ఎంపీలు ఇద్దరు తమ పార్టీలో చేరతారని టీ- కాంగ్రెస్ పార్టీ నేత  రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం, ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీలు విశ్వేశ్వర్ రెడ్డి,  సీతారాం నాయక్ లు ఈరోజు ఖండించడం విదితమే. ఇదే అంశంపై రేవంత్ రెడ్డి మరోమారు తాజా వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ఇద్దరు తమ పార్టీలో చేరతారని చెప్పానే గానీ, ఎవరి పేర్లూ చెప్పలేదుగా? అని రేవంత్ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై విశ్వేశ్వర్ రెడ్డి, సీతారాం నాయక్ లు తనను ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకోవడం ఎందుకంటూ సెటైర్లు విసిరారు.

ఆ ఇద్దరు ఎంపీలను మంత్రి కేటీఆర్ పిలిపించుకుని ఎందుకు వివరణ అడిగారో ప్రజలకు చెప్పాల్సిన అవసరముందని అన్నారు. డిసెంబర్ ఏడో తేదీ నాటికి రెండు వికెట్లు పడటం ఖాయమని పునరుద్ఘాటించిన రేవంత్, ఆ వికెట్లలో ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారని అన్నారు. ఈ ఇద్దరు ఎంపీలు ప్రగతి భవన్ కు వెళ్లి కేటీఆర్ ను కలిశారంటే, అక్కడ రాజకీయ కార్యకలాపాలు జరిగినట్టేనని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. అందుకే, ఈ విషయం పైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. కేసీఆర్ నామినేషన్ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగి విజయ్ కుమార్ పాల్గొన్నారని, ఈ ఉద్యోగిపై తెలంగాణ ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ విషయమై సీఈఓకు ఫిర్యాదు చేసినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.

More Telugu News