Pakistan: రెస్టారెంట్ లో కుళ్లిన మాంసంతో వంటలు.. ఆరగించిన ఇద్దరు కస్టమర్ల మృతి!

  • పాకిస్తాన్ లోని కరాచీలో ఘటన 
  • 2015లో కొన్న మాంసంతో వంటలు
  • యజమాని అరెస్ట్, రెస్టారెంట్ సీజ్

రొటీన్ కు భిన్నంగా అప్పుడప్పుడూ కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్ కు వెళుతుంటాం. కానీ ఈ వార్త చదవితే మాత్రం ఇకపై రెస్టారెంట్ లేదా హోటల్ కు వెళ్లాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఓ ఫేమస్ రెస్టారెంట్ లో భోజనం తిన్నాక ఇద్దరు కస్టమర్లు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వీరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ ఘటన పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో చోటుచేసుకుంది.

కరాచీలోని ఆరిజోనా గ్రిల్ రెస్టారెంట్ లో ఇటీవల కొందరు భోజనం చేశారు. వెంటనే వారంతా అస్వస్థతకు లోనుకాగా, కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు,. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. వీరు రెస్టారెంట్ లో తిన్న మాంసం మూడేళ్ల క్రితం నాటిదని అధికారులు గుర్తించారు. కుళ్లిపోయిన మాంసాన్ని రెస్టారెంట్ నిర్వాహకులు వేడిచేసి కస్టమర్లకు వడ్డిస్తున్నారని వెల్లడించారు.

దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. 80 కిలోల చెడిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2015 సమయంలో ఈ ప్యాకేజ్డ్ మాంసాన్ని రెస్టారెంట్ యజమానులు కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. రెస్టారెంట్ యజమానిపై ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు కస్లమర్లు తిన్న మాంసం స్లో పాయిజన్ గా మారడంతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ హోటల్ ను సీజ్ చేశామన్నారు.

More Telugu News