Telangana: 'ఫోన్‌ పోయింది.. వెతికివ్వండి' అంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి, తాగుబోతు హల్ చల్!

  • వాటర్ ట్యాంక్ ఎక్కిన నారాయణస్వామి
  • ఫోన్ ను వెతికిపెట్టాలని పోలీసులకు విన్నపం
  • తాళ్లతో బంధించి కిందకు దించిన అధికారులు

పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి తన ఫోన్ పోయిందని పోలీసులను ఆశ్రయించాడు. ‘మేం ఫోన్ వెతికి పెడతాం లే’ అని చెప్పినా వినకుండా వాటర్ ట్యాంక్ ఎక్కాడు. తన ఫోన్ తెచ్చి ఇచ్చేవరకూ ట్యాంక్ దిగబోనని స్పష్టం చేశాడు. దీంతో అతికష్టం మీద అతడిని తాళ్లతో కట్టిన అధికారులు కిందకు దించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో చోటుచేసుకుంది.

జిల్లాలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన తులసి నారాయణస్వామి పెయింటర్ గా పనిచేస్తున్నాడు. అతను నిన్న సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. దీంతో పూటుగా ముందు కొట్టాడు. అనంతరం అక్కడే టీ తాగుతున్న ఇద్దరు కానిస్టేబుళ్ల వద్దకు వెళ్లి ‘అన్నా.. నా సెల్ ఫోన్ పోయింది. మీరే వెతికిపెట్టాలి’ అని కోరాడు. తాము వెతికిపెడతామనీ, టీ తాగాలనీ వారిద్దరూ టీ ఇప్పించారు.

అది తాగిన నారాయణస్వామి పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం చెలరేగింది. తన ఫోన్ ను తెచ్చిస్తేనే ట్యాంక్ పై నుంచి దిగుతానని నారాయణస్వామి స్పష్టం చేశాడు. వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ మాన్ సింగ్ చాకచక్యంగా వాటర్ ట్యాంక్ పైకి వెళ్లి నారాయణస్వామిని పట్టుకున్నాడు.

అనంతరం కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి జాగ్రత్తగా కిందకు దించారు. కాగా, పోలీసులు కిందకు దించుతున్న సమయంలో ఈ మందుబాబు ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ అంటూ నినాదాలు ఇవ్వడం గమనార్హం.

More Telugu News