Vijay Sai Reddy: జగన్ పై హత్యాయత్నం ఘటనకు సూత్రధారుడు చంద్రబాబు: విజయసాయిరెడ్డి ఆరోపణ

  • రాష్ట్రపతిని కలిసిన వైసీపీ నేతల బృందం
  • జగన్ పై హత్యాయత్నం గురించి వివరించిన నేతలు
  • కేంద్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరిన వైనం

ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను వైసీపీ నేతల బృందం ఈరోజు కలిసింది. జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి ఆయనకు వారు వివరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని ఆ పార్టీ నేతలు కోరారు. ఈ కేసును నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించినట్టు సమాచారం. రాష్ట్రపతిని కలిసిన వైసీపీ నేతల బృందంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.

రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నానికి సూత్రధారుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. చంద్రబాబుతో పాటు ఏపీ డీజీపీ, టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, యరపతినేని, సినీ నటుడు శివాజీ, విశాఖ ఎయిర్ పోర్టులోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ కూడా ఈ కుట్రలో భాగస్వాములని ఆరోపించారు. చంద్రబాబు ప్రమేయం లేకపోతే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించవచ్చు కదా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి లేదా కోర్టు ఉత్తర్వుల ద్వారా నిష్పాక్షిక దర్యాప్తు జరిగితే, హత్యాయత్నం వెనుక కుట్రదారులు బయటపడతారని అన్నారు.

More Telugu News