Telangana: టీఆర్ఎస్ కు బోడిగె శోభ గుడ్ బై.. దళిత మహిళకు అన్యాయం చేశారంటూ కంటతడి!

  • టీఆర్ఎస్ అధిష్ఠానంపై ఆగ్రహం
  • మద్దతుదారులతో నేడు భేటీ
  • బీజేపీ గూటికి చేరొచ్చంటున్న సన్నిహితులు

అంతా అనుకున్నట్లే అయింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సమర్పించారు. చొప్పదండి టికెట్ ను కేటాయించేందుకు పార్టీ అధిష్ఠానం ముందుకు రాకపోవడంతో ఆమె టీఆర్ఎస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ రోజు ప్రకటించారు. నియోజకవర్గంలో మండలాలవారీగా అనుచరులతో ఆమె సమావేశం నిర్వహించారు. అనంతరం తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన తనకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్యాయం చేశారని శోభ కంటతడి పెట్టుకున్నారు. ఏదేమయినా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు.

తన భవిష్యత్ కార్యాచరణను రేపు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తానని శోభ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు తర్వాత అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్, చొప్పదండి నియోజకవర్గంపై మాత్రం సస్పెన్స్ కొనసాగించారు. నియోజకవర్గంలో శోభ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పలువురు సీనియర్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అలాగే నియోజకవర్గంలో శోభ అనుచరుల తీరుపై అనేక ఫిర్యాదులు పార్టీకి అందాయి. ఈ నేపథ్యంలో శోభకు టికెట్ కేటాయించేందుకు టీఆర్ఎస్ హైకమాండ్ నిరాకరించినట్లు సమాచారం. కాగా, శోభ బీజేపీలో చేరే అవకాశముందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

More Telugu News