Telangana: నాపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్

  • నిబంధనల ప్రకారమే నడచుకుంటున్నా
  • పనిదినాల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తాం
  • ముఖ్య ప్రచారకుల పేర్లు వారం రోజుల్లోగా ఇవ్వాలి

తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, బోగస్ ఓట్ల తొలగింపులో నిబంధనల ప్రకారమే నడచుకుంటున్నామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందని, పనిదినాల్లో మాత్రమే అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు.

నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల ఖర్చులు ఇప్పటి నుంచే లెక్కలోకి వస్తాయని, ముఖ్య ప్రచారకుల పేర్లు వారం రోజుల్లోగా ఇవ్వాలని సూచించారు. స్టార్ కంపెయినర్స్ పేర్లు ఇవ్వకుంటే ఖర్చంతా ఆయా అభ్యర్థులకే అయినట్టు పరిగణిస్తామని స్పష్టం చేశారు.డిసెంబర్ 7న 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.

రూ.77.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నాం

ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్టు రజత్ కుమార్ చెప్పారు. రూ.77.62 కోట్ల నగదు, 2.63 కోట్ల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అక్రమంగా నిర్వహిస్తున్న 4,038 మద్యం దుకాణాలు మూసివేశామని, సి-విజిల్ యాప్ కు ఇప్పటివరకు 2251 ఫిర్యాదులు అందగా, అందులో 81 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. నియమావళి ఉల్లంఘనలపై 98 ఫిర్యాదులు అందగా, అందులో 38 పూర్తిగా పరిష్కరించామని, మరో 12 కేసులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించామని, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన నోటీసులపై ముగ్గురు నేతలు వివరణ ఇచ్చారని స్పష్టం చేశారు.

ఎన్నికల బందోబస్తుకు 275 కంపెనీల బలగాలు

పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామని, ఈఎస్ఐలో వైద్యుల నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చిందని, తెలంగాణ ఓటర్ల జాబితాలో పునరావృతమైన 1.60 లక్షల పేర్లు తొలగించేందుకు ఈసీని అనుమతి కోరామని చెప్పారు. ఎన్నికల బందోబస్తు నిమిత్తం 275 కంపెనీల బలగాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపినట్టు రజత్ కుమార్ పేర్కొన్నారు.

More Telugu News