Telangana: అసలు సమరం నేటి నుంచి... తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమైన రోజులివి!

  • నోటిఫికేషన్ విడుదల చేస్తూ గెజిట్
  • మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు
  • 19తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
  • 22న తుదిజాబితా, డిసెంబర్ 7న ఎన్నికలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు ఘట్టం నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్ విడుదల కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 నియోజకవర్గాలు రిజర్వ్ అయి ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం రిటర్నింగ్ కార్యాలయాలను సిద్ధం చేశారు.

ఇక నామినేషన్ల స్వీకరణ ఈ నెల 19తో ముగియనుండగా, 20వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 22వ తేదీ కాగా, బరిలో మిగిలే అభ్యర్థుల తుది జాబితా అదే రోజున విడుదలవుతుంది. ఆపై డిసెంబర్ 5తో ప్రచారం ముగించాల్సి వుంటుంది. పోలింగ్ డిసెంబర్ 7వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుంది.

ఈ పోలింగ్ లో మొత్తం  2.73 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనుండగా, మొత్తం 32,791 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు జరుగనుండగా, 13తో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగుస్తుంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు 54 వేల మంది రాష్ట్ర పోలీసు బలగాలతోపాటు 275 కంపెనీల సాయుధ పోలీసు బలగాలు భద్రతా ఏర్పాట్లలో పాలుపంచుకోనున్నాయి.

More Telugu News