CBI: టీడీపీ నుంచి ఆఫర్ రాలేదు.. నేనైతే ఎవరినీ వెళ్లి కలవను: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • ఆప్, బీజేపీ నుంచి ఆహ్వానాలు అందాయి
  • నేను ఎవరి వద్దకు వెళ్లను
  • సవాళ్లంటే నాకు ఇష్టం

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు బహు అరుదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, బీజేపీ నేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి కేసులతో ఆయన పేరు మార్మోగిపోయింది. ఇటీవల ఆయన తాను చేస్తున్న ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మరో నెల రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతున్న లక్ష్మీనారాయణ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన మీకు ఏయే పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయన్న ప్రశ్నకు లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆహ్వానాలు అందినట్టు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తనకు ఫోన్ చేసి మాట్లాడారని, బీజేపీ నుంచి ఒకరిద్దరు నేతలు వచ్చి కలిశారని తెలిపారు. ఏపీలోని టీడీపీ, వైసీపీ, పవన్ కల్యాణ్ జనసేన, కాంగ్రెస్‌లలో మూడు పార్టీలే ప్రధానమైనవని పేర్కొన్నారు. ఆ పార్టీల నుంచి తనకు పిలుపు రాలేదని స్పష్టం చేశారు. టీడీపీ నుంచి కూడా పిలుపు రాలేదా? అన్న ప్రశ్నకు రాలేదన్నారు. తానెవరినీ వెళ్లి కలవబోనని తేల్చి చెప్పారు. ఒకవేళ సొంతంగా కనుక పార్టీ పెడితే నెగ్గుకు రాగలరా? అన్న ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ.. దేనినైనా సవాలుగా తీసుకోవడం తనకు ఇష్టమని, అలాగే ముందుకెళ్తానని పేర్కొన్నారు.

More Telugu News