Kerala: శబరిమలలోకి మహిళలనే అనుమతించాలి.. పురుషుల ప్రవేశంపై నిషేధం విధించాలి!: రచయిత్రి మీరా

  • పంబలో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది
  • సుప్రీం తీర్పుకు నేను మద్దతు ప్రకటించాను
  • అందుకే హిందూ సంస్థలు నన్ను అడ్డుకున్నాయి

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి కేవలం మహిళలనే అనుమతించాలని ప్రముఖ ఫెమినిస్ట్, సాహిత్య అకాడమీ అవార్డు విజేత కేఆర్ మీరా అభిప్రాయపడ్డారు. ఆలయ ప్రవేశానికి పురుషులు రాకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. గతంలో తనను ఇదే ప్రశ్న అడిగితే అక్కడకు ఎవ్వరినీ పంపకుండా నిషేధం విధించాలని కోరే దానినని అన్నారు. మనుషుల కారణంగా పంబలో విపరీతమైన కాలుష్యం నెలకొందని వ్యాఖ్యానించారు. ఎవ్వరినీ అనుమతించకుంటే మనుషుల సంచారం తగ్గి శబరిమల ప్రాంతంలో పులులు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలవుతుందని చెప్పారు.

అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశానికి అనుకూలంగా సుప్రీంకోర్టు గత సెప్టెంబర్ లో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని కేఆర్ మీరా స్వాగతించారు. దీంతో ఆమెకు వ్యతిరేకంగా అతివాద హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. చిన్నారుల అక్షరాభ్యాసం కోసం జరుగుతున్న కార్యక్రమం కోసం పదనాంతిట్టలో ఓ ఆలయ నిర్వాహకులు తనను ఆహ్వానించారని మీరా తెలిపారు. అయితే తనను అడ్డుకోవడానికి కొందరు హిందుత్వ సంస్థల సభ్యులు నల్లజెండాలతో సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. దీంతో చిన్నారుల అక్షరాభాస్యం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆ కార్యక్రమానికి దూరమైనట్లు పేర్కొన్నారు.

మత విశ్వాసాల పేరుతో  కొందరు క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారనీ, ఇది సరికాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతటా వరదలు విలయం సృష్టిస్తే, దాన్ని మర్చిపోయి మగ దైవమైన అయ్యప్ప బ్రహ్మచర్యంపై మాత్రమే హిందుత్వ సంస్థలు ఆందోళన చెందుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆలయంలో సంస్కరణలపై ఇప్పటివరకూ తాంత్రి కుటుంబ సభ్యులే అభ్యంతరం వ్యక్తం చేసేవారన్నారు.

More Telugu News