Telugudesam: టీడీపీ సీనియర్‌ ముస్లిం నాయకునికి సముచిత స్థానం!

  • శాసన మండలి చైర్మన్‌ కానున్న ఎం.ఎ.షరీఫ్‌
  • టీడీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నముస్లిం నేత
  • శాసన మండలి ఏర్పాటైన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకు దక్కిన తొలి అవకాశం

సీనియర్‌ తెలుగుదేశం నాయకుడు ఎం.ఎ.షరీఫ్‌కు సముచిత స్థానం కల్పించి అధిష్ఠానం ఆయన సేవలకు తగిన గుర్తింపు నిస్తోంది. ఖాళీ అవుతున్న శాసన మండలి చైర్మన్‌ పదవికి ఆయనను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత చైర్మన్‌ ఫరూఖ్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోనుండడంతో ఆ స్థానం ఖాళీ అవుతోంది. దీంతో త్వరలో జరిగే విధాన మండలి సమావేశాల్లో షరీఫ్‌ను చైర్మన్‌గా ఎన్నుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

పార్టీ ఆవిర్భావం నుంచి ఎం.ఎ.షరీఫ్‌ క్రియాశీలక కార్యకర్తగా వ్యవహరించడమేకాక, ఎన్టీఆర్‌ విశ్వాస పాత్రుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ముప్పై ఐదేళ్ల తన రాజకీయ జీవితంలో ఆయన టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. నరసాపురం పట్టణ కార్యదర్శిగా షరీఫ్‌ రాజకీయ ప్రస్థానం మొదయింది. పార్టీ జాతీయ కార్యదర్శి వరకు కొనసాగింది.

ముస్లిం వర్గాల్లోనే కాకుండా ఇతర వర్గాల్లో కూడా షరీఫ్‌కు మంచి పట్టుంది. షరీఫ్‌ చైర్మన్‌ అయితే శాసన మండలి ఏర్పాటైన తర్వాత పశ్చిమగోదావరి జిల్లాకు ఈ అత్యున్నత పదవి తొలిసారి దక్కినట్లవుతుంది.

More Telugu News