Andhra Pradesh: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి.. హత్య అంటున్న స్థానికులు!

  • ఒకే కుటుంబంలో నలుగురి దుర్మరణం
  • ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో ఘటన
  • కేసు నమోదుచేసిన పోలీసులు

గ్యాస్ లీకేజీ ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలిగొంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని రాజులకండ్రిగలో ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది.

ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో శ్రీనివాసరాజు, బుజ్జమ్మ దంపతులు ఉంటున్నారు. శ్రీనివాసరాజు ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ దంపతులకు నితిన్, భవ్య అనే చిన్నారులు ఉన్నారు. వీరి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ నుంచి బాత్రూమ్ లోని గీజర్ కు కనెక్షన్ ఉంది. ఈ నేపథ్యంలో గీజర్ కు ఉన్న కనెక్షన్ ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 3-4 గంటల మధ్య లీక్ అయింది. నిద్రపోతున్న సమయంలో లీకేజీ జరగడంతో వీరంతా స్పృహ కోల్పోయారు.

ఇంతలోనే ఇంట్లోని విద్యుత్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లోనే వీరంతా సజీవ దహనం అయ్యారు. కాగా, ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అని పోలీసులు చెబుతుండగా, ఇది హత్యాయత్నమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు.

శ్రీనివాసరాజు ఇంటిలో పెట్రోల్ క్యాన్ ఉందనీ, ఇంటి తలుపులన్నీ తెరిచే ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News