Afghan: ఢిల్లీ విమానాశ్రయంలో హైజాక్ కలకలం.. పొరపాటు అయిందన్న పైలట్

  • కాందహార్ వెళ్లాల్సిన విమానం నుంచి హైజాక్ అలెర్ట్
  • రన్‌వే పక్కకు తీసుకెళ్లి చుట్టుముట్టిన భద్రతా సిబ్బంది
  • తన పొరపాటేనన్న పైలట్

ఢిల్లీ విమానాశ్రయంలో ఆఫ్ఘానిస్థాన్ విమాన పైలట్ చేసిన తప్పిదానికి ప్రయాణికులు గడగడలాడిపోయారు. విమానాశ్రయం మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఆఫ్ఘనిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఢిల్లీ నుంచి కాందహార్‌కు బయలుదేరాల్సి ఉంది. 124 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బందితో శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు టేకాఫ్‌ కావాల్సి ఉంది. అంతలోనే అధికారులకు హైజాక్ అలెర్ట్ వినిపించింది. అంతే.. ఒక్కసారిగా అందరూ అప్రమత్తమయ్యారు. విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు.

అయితే, భయపడాల్సింది ఏమీ లేదని, తానే పొరపాటున హైజాక్ బటన్‌ను నొక్కినట్టు పైలట్ పేర్కొనడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలెర్ట్ ఎలా పనిచేస్తోందో కో-పైలట్‌కు చెబుతూ దానిని ప్రమాదవశాత్తు ప్రెస్ చేసినట్టు పైలట్ తెలిపాడు. అయినప్పటికీ విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం అధికారులు టేకాఫ్‌కు అనుమతించారు.

More Telugu News