నల్గొండలో కోమటిరెడ్డికి ఊహించని ఘటన.. అవాక్కయిన కార్యకర్తలు

10-11-2018 Sat 21:01
  • నల్గొండలో ప్రచారం నిర్వహించిన కోమటిరెడ్డి
  • టీఆర్ఎస్ కండువా కప్పేందుకు యత్నం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకటరెడ్డి
ఎన్నికల వేళ ఎన్నో సిత్రాలు జరుగుతుంటాయి. కొన్నిచోట్ల అభ్యర్థులకు తీవ్ర పరాభవం ఎదురవుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఊహించని ఘటన ఎదురైంది. నేడు నల్గొండలోని పాతబస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

దీనిలో భాగంగా ఓ దుకాణం వద్ద ఓట్లను అభ్యర్థిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అకస్మాతుగా వచ్చి టీఆర్ఎస్ కండువా కప్పబోయాడు. వెంటనే అప్రమత్తమైన కోమటిరెడ్డి ఒక అడుగు వెనక్కి వేసి ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అవాక్కయ్యారు. అనంతరం కోమటిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వ్యక్తి టీఆర్ఎస్‌ కార్యకర్తగా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.