నవాజుద్దీన్ నన్ను నమ్మించి మోసం చేశాడు: మాజీ మిస్ ఇండియా నిహారిక సింగ్

  • పెళ్లి చేసుకుంటానని చెప్పి.. లైంగిక సంబంధం పెట్టుకున్నాడు
  • ఎంతో మంది మహిళలతో అతనికి సంబంధాలు ఉన్నాయి
  • అతనితో విడిపోయాక కూడా.. శారీరక సంబంధం కొనసాగించే ప్రయత్నం చేశాడు

ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీపై మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ నిహారిక సింగ్ లైంగిక ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి... నవాజుద్దీన్ మోసం చేశాడని బాంబు పేల్చింది. తనతోనే కాకుండా ఆయనకు ఎందరో మహిళలతో శారీరక సంబంధాలు ఉన్నాయని చెప్పింది.

2009లో 'మిస్ లవ్లీ' అనే చిత్రంలో నవాజుద్దీన్ తో కలసి నటించానని... ఆ సందర్భంలో ఒక రోజు తన ఇంటికి ఆయన తనను పిలిచాడని నిహారిక తెలిపింది. అప్పటి నుంచి తరచుగా తాము కలుసుకునేవారమని చెప్పింది. ఒక రోజు తన ఇంటి ముందు ఉన్నానని నవాజుద్దీన్ తనకు మెసేజ్ చేశాడని... ఇంట్లోకి రావాలని తాను ఆహ్వానించానని... ఇంట్లోకి రాగానే తనను కౌగిలించుకున్నాడని... అప్పటి నుంచి తమ మధ్య బంధం కొనసాగిందని తెలిపింది.

మనోజ్ బాజ్ పేయి, పరేష్ రావల్ మాదిరి తనకు కూడా మిస్ ఇండియాను పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉందని నవాజుద్దీన్ చెబితే నమ్మానని నిహారిక చెప్పింది. ఆయనలో నిజాయతీ కనిపించడం లేదని నవాజుద్దీన్ చెల్లెలు తనను హెచ్చరించిందని... అయినా తాను వినలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత అతనికి ఎంతో మందితో సంబంధాలు ఉన్నాయనే విషయం తనకు తెలిసిందని... తన ఫోన్ నుంచే ఎంతో మందికి కాల్ చేసేవాడని చెప్పింది. అప్పటికే అతనికి పెళ్లై, వరకట్న వేధింపుల కేసు నడుస్తోందని తెలియడంతో అతనికి దూరమయ్యానని తెలిపింది. అతనితో విడిపోయాక కూడా... తనతో శారీరక సంబంధం కొనసాగించేందుకు అతను యత్నించాడని చెప్పింది. కామంతో కళ్లు మూసుకుపోయిన భారతీయుడు నవాజుద్దీన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

More Telugu News