YSRCP: జగన్‌పై దాడికేసు.. శ్రీనివాసరావుకు పోలీసు కస్టడీ లేనట్టే?

  • నేటితో ముగియనున్న శ్రీనివాసరావు రిమాండ్ గడువు
  • నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
  • మరో 14 రోజులు రిమాండ్‌ను పొడిగించే అవకాశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి కేసు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో పోలీసు కస్టడీకి మరోమారు అప్పగించే అవకాశాలు కనిపించడం లేదు. విచారణలో నిందితుడు తమకు సహకరించడం లేదని, కాబట్టి నిజాలను రాబట్టేందుకు మరో వారం పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ‘సిట్’ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

దీంతో మరో పిటిషన్‌ను దాఖలు చేసినా, కోర్టు దానిని పెండింగ్‌లో పెట్టింది. పర్యవసానంగా మరోసారి కస్టడీకి ఇచ్చే అవకాశాలు దాదాపు లేవనే తెలుస్తోంది. శ్రీనివాసరావును నేడు మూడో మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీకి ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో నిందితుడి రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిందితుడి ఆరోగ్యం  సరిగా లేకపోవడంతో మానసిక వైద్యశాల నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని జైలుకు పంపి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిందితుడి తరపు న్యాయవాది అబ్దుల్ సలీం గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు కోర్టు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

More Telugu News